దివ్యాంగ విద్యార్థుల ఎవరెస్ట్ సాహసయాత్ర... జెండా ఊపి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

  • ప్రత్యేక అవసరాలు గల 21 మంది విద్యార్థుల ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర ప్రారంభం
  • దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమం
  • ఉండవల్లిలో యాత్రను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్
  • కసి, పట్టుదలే మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని విద్యార్థులకు ఉద్బోధ
  • సమాజంలో మార్పు కోసం ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహిస్తామన్న మంత్రి
కసి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ప్రపంచాన్ని జయించాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక అవసరాలు గల 21 మంది దివ్యాంగ విద్యార్థుల బృందం చేపట్టనున్న నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను మంత్రి లోకేశ్ మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులతో ఇలాంటి సాహసయాత్ర నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ నెల ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు 16 రోజుల పాటు ఈ సాహసయాత్ర కొనసాగనుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న 21 మంది విద్యార్థులు (8 మంది బాలికలతో సహా) ఈ బృందంలో ఉన్నారు. వీరంతా సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించనున్నారు. ఏప్రిల్ 15న మధ్యాహ్నం ఈ బృందం నేపాల్ రాజధాని ఖాట్మండూకు చేరుకొని, అక్కడి నుంచి తమ యాత్రను ప్రారంభిస్తుంది.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై ముఖాముఖి నిర్వహించారు. వారిలో స్ఫూర్తి నింపుతూ, "ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులుగా మీరు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు వెళ్లడం చాలా ఆసక్తిగా, గర్వంగా ఉంది. సాధారణ వ్యక్తులలో లేని కృషి, పట్టుదల మీలో ఉన్నాయి. జీవితంలో మీరు ఎన్నో అవమానాలు, మాటలు ఎదుర్కొని ఉంటారు. వాటన్నింటినీ అధిగమించి ఈ స్థాయికి రావడం అభినందనీయం. మనలో ఉన్న కసి, పట్టుదలే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి" అని అన్నారు.

"మీలాంటి వారిని ప్రోత్సహిస్తే సమాజంలో కూడా గొప్ప మార్పు వస్తుంది. ఈ కార్యక్రమాన్ని నేను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాను. మా కుటుంబంలో కూడా ఒకరు మాట తడబాటుతో ఇబ్బంది పడ్డారు. ఎంతోమంది ఎగతాళి చేశారు. దేవుడు ప్రతి కుటుంబానికి ఒక పరీక్ష పెడతాడు, దానిని జయించే శక్తిని కూడా ఇస్తాడు. ఆ శక్తి మీ అందరిలో ఉంది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. సవాళ్లను అధిగమించి ప్రపంచాన్ని జయించండి. సమాజం మిమ్మల్ని గౌరవించేలా, సొంత పిల్లల్లా చూసుకునేలా మీరు ఎదగాలి" అని లోకేశ్ పేర్కొన్నారు.

ప్రతి ఏడాది ఇలాంటి ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. "ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు 'అమ్మకు చెప్పలేని పని చేయవద్దు' అనే మాటను జీవితాంతం గుర్తుంచుకోండి. నా జీవితంలో కూడా ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు ఎంతో సాయం చేశారు. అదేవిధంగా మీరు కూడా సమాజానికి తిరిగి సేవ చేయాలి. కనీసం 10 మందికి సాయపడాలి. మిమ్మల్ని చిన్నచూపు చూడాలంటే భయపడేలా మీ కృషితో, పట్టుదలతో సమాజానికి ఆదర్శంగా నిలవాలి" అని మంత్రి ఉద్బోధించారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ విద్య, దివ్యాంగుల ప్రోత్సాహం, అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులను అభినందించి, వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.

Nara Lokesh
Divyang Students
Everest Base Camp
Andhra Pradesh
Differently Abled
Education
Nepal
Inspiration
Samagra Shiksha
Adventure

More Telugu News